Telugu Story: మృగరాజుకు ఎలుగుబంటి చేసిన సాయం

మృగరాజుకు ఎలుగుబంటి సాయం

వంశధార అడవుల్లో సౌమ్యుడు అనే ఎలుగుబంటి ఉండేది. మంచి స్వభావం కలది. ప్రతిఫలం ఆశించకుండా జంతువులకు వైద్యం చేసేది.

ఒకసారి మూలికలు, ఆకులు అవసరమై ప్రక్క అడవికి వెళ్ళిందది. తిరిగి వస్తుండగా దారి ప్రక్కనున్న పెద్ద గోతిలో నుండి కాపాడమన్న శబ్దాలు వినిపించాయి దానికి. సరకుల మూటని ప్రక్కన పెట్టి గోతిలోకి చూసిందది.

అందులో సింహం ఉంది. గాయపడడం వలన రక్తం పోయినట్టు కనబడింది. “ఎవరు నువ్వు? గోతిలో ఉన్నావేం? అనడిగింది ఎలుగుబంటి.

“ నేను మృగరాజు పింగళకుడు. వేటగాళ్లను తరుముతూ వచ్చి గోతిలో పడ్డాను. వాళ్ళు వచ్చి బంధించేలోగా నన్ను రక్షించు” అంది నీరసంగా .

ఎలుగుబంటి పెద్దగా కేకలు వేస్తూ “మృగరాజు ప్రమాదంలో ఉంది. రక్షించాలి” అని అరచింది. అది విన్న కొన్ని జంతువులు వచ్చాయి. ఒక ఏనుగు తొండంతో పెద్ద చెట్టుని పెకిలించి ఒడుపుగా గోతిలో వేసింది. ఏటవాలుగా దాని మీద నడుస్తూ సింహం బయటపడింది.

అప్పటికే అడవిలో సేకరించిన ఆకులు, మూలికలతో మృగరాజుకి వైద్యం చేసి , తరువాత ఉపయోగించమని మరికొన్ని పసర్లు ఇచ్చి తన అడవికి వెళ్ళిపోయింది ఎలుగుబంటి.
తన ప్రాణం కాపాడినందుకు ఏదైనా బహుమతిని తీసుకోమని సింహం అడిగినా వద్దంది ఎలుగుబంటి. కొన్నిటికి అత్యవసర వైద్యం చెయ్యాలని తొందరగా నడచుకుంటూ వెళ్ళిపోయింది.

వారం తర్వాత అరుదైన పండ్లను, దుంపలను, చెరకు గడలను ఎలుగుబంటికి ఇచ్చి రమ్మని గుర్రం మీద పంపించింది సింహం.
“ ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే వైద్యం చేస్తాను.నేనేదో గొప్ప పని చేసినట్టు మృగరాజు అనుకోవద్దు. వీటిలో ఒక్క పండు తీసుకుంటాను” అని సున్నితంగా చెప్పింది ఎలుగుబంటి. తెచ్చిన వాటిని తిరిగి మోసుకు వెళ్లిన గుర్రం ఆ మాటే సింహానికి చెప్పింది. ఎలుగుబంటికి ఎలాగైనా ప్రత్యుపకారం చేయాలనుకుంది సింహం.

కొన్నాళ్లు పోయాక మధురం అనే చిలుకతో “ తమ ఆతిధ్యం పొందడానికి కొన్నాళ్ళు రమ్మని “ కబురు పంపింది సింహం.
“నా వైద్యం పొంది బ్రతకాల్సిన జంతువులను ఇక్కడ గాలికి వదిలేసి రాలేను” అని జవాబు పంపింది ఎలుగుబంటి.
చిలుక కబురు తెచ్చినప్పుడు ఉన్న జంతువులు “ పొరుగు అడవికి మృగరాజు కబురు పెడితే వెళ్లవా? అదే అవకాశం మాకొస్తే వదిలే వాళ్ళం కాదు” అన్నాయి. సౌమ్యుడు బదులివ్వకుండా పని చేసుకున్నాడు.

ఒకసారి కార్చిచ్చు అంటుకుని సౌమ్యుడు ఉన్న అడవి కాలిపోయింది. జంతువులు ప్రాణభయంతో పరుగులు తీసాయి. అయినా చాలా జంతువులు చనిపోయాయి. అదృష్టవశాత్తు సౌమ్యుడి కుటుంబం ఎక్కడో దూరంగా ఉండడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. అడవిలో బ్రతికిన మిగిలిన జంతువులకు ఆహారం దొరకడమే కష్టమైంది. పచ్చటి చెట్టన్నది కనబడలేదు అక్కడ బ్రతుకు దుర్భరమైంది.
అలాంటప్పుడు సౌమ్యుడితో భార్యా పిల్లలు “ ఇప్పుడైనా పింగళకుడి దగ్గరకు వెళదాం” అన్నాయి.

“ ఎప్పుడో జరిగిన ఆ విషయం మృగరాజుకి గుర్తుందో లేదో. అక్కడికెళ్లి అవమానపడే కంటే దొరికిందేదో తిని బ్రతుకుదాం” అంది ఎలుగుబంటి.

అలా అనుకున్న మూడు రోజులకే ఒక కాకి వచ్చి సౌమ్యుడిని కలసింది. పింగళకుడికి పెద్ద వ్యాధి వచ్చిందని, వెంటనే బయలుదేరమని చెప్పింది. “మా అడవి కాలిపోవడంతో నా దగ్గర వైద్య సామాగ్రి లేదు” అంది ఎలుగుబంటి.
ఉన్నపళంగా వస్తే అవన్నీ చూసుకుంటామని బదులిచ్చిందది. తప్పనిసరి పరిస్థితుల్లో బయల్దేరింది ఎలుగుబంటి. దాంతోబాటు భార్యా, పిల్లలు వెళ్ళాయి.

“సింహానికి వ్యాధి ముదరకూడదని, అవసరమైన మూలికలు అక్కడ దొరకాలని ” దారంతా వనదేవతకి మొక్కుకుంటూనే వెళ్ళింది ఎలుగుబంటి.
పింగళకుడి గుహ దగ్గరకి వెళ్లేసరికి చాలా జంతువులు కనబడ్డాయి ఎలుగుబంటికి. సింహానికేదైనా జరిగిందేమో అని కంగారు పడింది ఎలుగుబంటి.

కానీ అక్కడొక ఎత్తైన రాతి మీద కూర్చుని సభ జరుపుతున్న సింహం కనబడింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఎలుగుబంటి ఆ విషయమే కాకిని అడిగింది . అదేమీ బదులు చెప్పకుండా మృగరాజు దగ్గరకు వెళ్లింది.

పింగళకుడు ఎలుగుబంటిని చూసి సంతోషంగా ఆహ్వానించి జంతువులకు పరిచయం చేస్తూ “నాకు ప్రాణదానం చేసిన దాత ఎలుగుబంటి. ఎన్నో మార్లు మన అడవికి రమ్మన్నా రాలేదు. నేనిచ్చిన బహుమతులు తీసుకోలేదు. వాళ్ల అడవి కాలిపోయి కష్టాల్లో ఉన్నా సరే మన సాయం కోరలేదు. అంత ఆత్మాభిమానం ఉన్న ఎలుగుబంటి ఇది. ఈ కాకి వచ్చి చెబితేనే విషయాలన్నీ నాకు తెలిసాయి. పోనీ సాయం చేద్దామంటే ఎలుగుబంటి అంగీకరించదని తెలుసు. అందుకే అత్యవసర వైద్యం నెపంతో మన అడవికి రప్పించాను. ఇది తప్పా?” అని అడిగింది.

“ తప్పు కాదు. మీ ప్రాణం కాపాడిన ఎలుగుబంటికి మనం సాయం చేయాలి” అని అరిచాయి జంతువులు.

వాటికి దగ్గర్లోనే ఉన్న మంత్రి కుందేలు “మనకి వైద్యుడు ఎలాగు లేడు. ఎలుగుబంటినే ఆస్థాన వైద్యుడు గా ప్రకటించండి మృగరాజా” అని సలహా ఇచ్చింది .

మృగరాజు సంతోషంగా ఆ విషయాన్ని సభలో ప్రకటించగానే జంతువులన్నీ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపాయి.
మృగరాజుకి కృతజ్ఞతలు చెబుతూ “నేను చేసిన సాయానికి పదవి ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ పెద్దమనసుకి జోహార్లు “ అంది ఎలుగుబంటి.
“ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేవారికి తప్పక మరో రూపంలో సాయం అందుతుందంటారు. నీవంటి మంచిదానికి ఒక పదవి నిచ్చి గౌరవించడం నా సభకే గర్వకారణం అవుతుంది “ అంది మృగరాజు.
కొత్త అడవిలో చక్కని వైద్య సేవలు అందించింది ఎలుగుబంటి.
—-***—–