Rice Card: రేషన్‌ కార్డులో చేరాలంటే.. కాళ్లరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా లో పరిస్థితి

శ్రీకాకుళం 2023: రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్తకార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన చిక్కులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా కార్డు దక్కడంలేదని జనం వాపోతున్నారు.

కార్డులో చేరాలంటే.. కాళ్లరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా లో పరిస్థితి

శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడు పార్వతీపురానికి చెందిన యువతిని వివాహ మాడాడు. వీరికి వివాహమై ఏడేళ్లు గడిచింది. తన కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చాలని ఆ యువకుడు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నగరంలోని మహాలక్ష్మి నగర్‌ కాలనీ సచివాలయానికి వెళ్లాడు. అక్కడున్న సచివాలయ సిబ్బంది వివాహ ధ్రువపత్రం కోరారు. దీని కోసం సబ్‌రిజిస్ట్రారు కార్యా లయానికి వెళ్లగా వయసు నిర్ధారణకు ఆధార్‌తో పాటు స్టడీ సర్టిఫికెట్‌ అడిగారు. వివాహం అయినట్లు పెళ్లి కార్డు, పెళ్లి చేసుకున్నట్లు ఫొటో అడిగారు. స్టడీని 1998లో చదివిన పాఠశాలకు వెళ్లి తీసుకొచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే యువతి పేరు తన తల్లిదండ్రుల రేషన్‌కార్డులో ఉందని, అక్కడ తొలగించాక రమ్మని చెప్పి, పంపించారు. ఇన్నాళ్లకు కార్డులో తన భర్త, పిల్లలతో చేరేందుకు అవకాశం వచ్చిందని ఆశపడ్డ ఆ యువతి అక్కడి సచివాలయానికి వెళ్తే మీ తల్లిదండ్రుల కార్డు నుంచి పేరు తొలగించడం ఎప్పుడో జరిగిపోయిందని చెపుతున్నారు. ఇంతలో గడువు ముగిసిపోయి వెబ్‌ ఆప్షన్‌ తొలగిస్తారేమో అన్న భయం ఆ దంపతులను వెంటాడుతోంది.

గతంలో ఇలా..

కార్డులో మార్పులకు పెట్టుకున్న దరఖాస్తులను సంబంధిత విఆరన్‌ఒలు పరిశీలించి, నివాస ధ్రువపత్రం మంజూరు చేసేవారు. దీన్ని సంబంధిత కార్యాలయం లో సమర్పిస్తే కుటుంబ సభ్యులుగా గుర్తించి కార్డులో వారి పేర్లు చేర్చేవారు.
పేరు తొలగించాల్సి వస్తే అందుకు అవసరమైన కారణాలను నిర్ధారించే ధ్రువపత్రం సమర్పిస్తే పని పూర్తయ్యేది. కాని ఇప్పుడు చేర్పులు, మార్పులు జరగాలంటే కాళ్లు అరిగి పోవాల్సిందే.
ఎన్నో అడ్డంకులు
భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. వీటిని పొందాల్సిన వారికి ఒంటరిగా ఉన్నట్లు రేషన్‌కార్డు తప్పని సరి. కానీ చాలా మందికి భర్తతో కలిసి ఉన్న కార్డులే ఉన్నాయి. కొత్త దాని కోసం వెళ్తే విడాకుల ధ్రువపత్రం అడుగుతున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో విడిపోయిన వారికి పత్రాలు తీసుకు రావడం సాద్యం కావడం లేదు.
కొత్తగా పెళ్లి అయిన వారి పేర్లను కార్డుల్లో చేర్చాలం టే ధ్రువపత్రం కావాలి. వివాహమై ఏడేళ్లు గడిచిన వారి పేరు చేర్చాలం టే ఇంటింటి సర్వేలో మ్యాపింగ్‌ జరిగి ఉండాలని చెబుతున్నారు. దీని కోసం వివాహ ధ్రువపత్రం అవసరం. జిల్లాలో పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్లు చేసుకునే అలవాటు లేకపోవడంతో కొందరు అవస్థలు పడుతున్నారు.

అదనపు ఖర్చు

వివాహ ధ్రువపత్రం కావాలంటే ప్రభుత్వ చలానాగా రూ.200 చెల్లించాలి. కానీ బయట ఖర్చులు రూ.2 వేల వరకు అవుతున్నట్లు బాధితులు చెపుతున్నారు.
పెళ్లై ఎక్కువ సంవత్సరాలు అయిన వారికి పత్రాలు కావాలంటే దంపతుల విద్యార్హత, స్టడీ సర్టిఫికెట్లు, పెళ్లి ఫొటో, ఆహ్వాన పత్రిక జతచేయాల్సి ఉంటుంది.
నిరక్షరాస్యులకు వయసు నిర్ధారణ పత్రాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎముకల వైద్యుల నుంచి తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వీరు లేకపోవడంతో జిల్లా కేంద్రం, టెక్కలి వెళ్లాల్సిన పరిస్థితి. దీని కోసం రూ.వేలల్లో ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో పంచాయతీ కార్యాలయం లో పూర్తయ్యే పనుల కోసం ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కొత్తగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించినట్టు చెపుతున్నా కార్యరూపం దాల్చలేదు. సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల వద్ద వివాహ ధ్రువపత్రాల కోసం విదేశాలకు వెళ్లే వారు తప్ప ఇతరులు కనిపించరు. కానీ ప్రస్తుతం రేషన్‌కార్డు కోసం వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి ఉండటంతో భారీగా వస్తున్నారు.
నిబంధనల మేరకు

రేషన్‌ కార్డుల విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను ప్రభుత్వం తెలియజేసింది. సంబంధిత ధ్రువపత్రాలు ముందుగా సమర్పిస్తే ఎక్కడా తిరగాల్సిన అవసరం ఉండదు. పత్రాలు లేకపోతే సంబంధిత నోటరీని సమర్పించే వెసులుబాటు కల్పించారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి, శ్రీకాకుళం