AP 10th Results 2022: రేపు మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స

పదోతరగతి ఫలితాలను సోమవారం 12 గంటలకు విద్యాశాఖామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వేదిక ఖారారైంది. విజయవాడ గెట్ వే హోటల్ (వివంత) వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల శనివారం విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రద్దు చేయగా ఈ ఏడు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 6,22,537 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. వారిలో బాలికలు 3,02,474 మంది, బాలురు 3,20,063 మంది ఉన్నారు. ఈ సారి గ్రేడుల బదులు విద్యార్థుల మార్కులను మాత్రం ప్రకటించనున్నారు. ర్యాంకుల ప్రచారంపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది.