TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2023 షెడ్యూలును తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 24న విడుదలచేసింది. లోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌-2023 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న జారీ చేయబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేయడానికి చివరిది ఏప్రిల్ 10. అలాగే విద్యార్థులు రూ.250 – రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7 నుంచి ఇంజినీరింగ్, మే 10 నుంచి అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి; మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ ఏడాది పరీక్షలు మునుపటిలా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. విద్యార్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ సబ్జెక్టుల సిలబస్‌లో 70% మాత్రమే తీసుకుంటారు. 2022లో ప్రస్తుత EAMCET పరీక్ష అభ్యర్థులు 70% సిలబస్‌తో మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇంటర్ రెండో సంవత్సరం నుంచి మాత్రం పూర్తి సిలబస్ ఉంటుంది.

ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకారం

➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.

➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023.

➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.

➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.

➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.

➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.

➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి

➥ పరీక్ష తేదీలు:  మే 7 నుంచి 11 వరకు (మే 7 – 9 వరకు ఇంజినీరింగ్, మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్).