తెలంగాణ: కాలయాపనకే కొత్త పెన్షన్‌పై కమిటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయం
ఎన్‌ఎంవోపీఎస్‌ సెక్రటరీ జనరల్‌

హైదరాబాద్‌, మార్చి 24 తెలంగాణ: నూతన పెన్షన్‌ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయమని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్‌) సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ తెలిపారు. కమిటీలతో కాలయాపన చేయకుండా పాత పెన్షన్‌ స్కీంను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కేంద్రమంత్రి ప్రకటన సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, గతంలో పాత పెన్షన్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనేది లేదని తెలిపిన కేంద్రం నేడు కమిటీని ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానాలో సీపీఎస్‌ ప్రభావంతో ఓటమి తప్పదని గ్రహించే ఇలా కంటి తుడుపు ప్రకటన చేశారని మండిపడ్డారు. పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ సీపీఎస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.