డేంజరస్ ఎక్స్‌పీరియన్స్‌: జొమాటో నిర్వాకం మరొక్కసారి వెలుగులోకి!

ముంబై: ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళకి నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌లో ఆమెషేర్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు.  ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా  వ్యూస్‌,  700 లైక్‌లను పొందింది.

మాములుగా ఇప్పటివరకు జొమాటో ఆప్ కోసం వచ్చే ఎన్నో కంప్లయింట్ లను చూసారు, కానీ ఇప్పుడు చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది వెజిటేరియన్స్ మనోభావాలు దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది.

అసలు ఏమి జరిగింది?

జొమాటోలో శాఖాహారం ఆర్డర్ చేస్తే.. చికెన్ పంపించారంటూ నిరుపమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్‌లో షేర్‌ చేసిన నాలుగు సెకన్ల చిన్న క్లిప్‌లో చికెన్‌ ముక్కను చిదుముతూ తన షాకింగ్‌ అనుభవాన్ని తెలిపారు.  ఇదేం సర్వీసురా బాబూ, భయంకరమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు.  దీనిపై జొమాటో స్పందించింది.  జరిగిన సంఘటనపై హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది.  దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.

అయితే  యూజర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఓ యూజర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క దర్శనమిచ్చింది. ఈ వీడియోను కూడా ఆయన  షేర్‌ చేశారు. అయితే   స్పందించి క్షమాపణలు చెప్పినప్పటికీ జొమాటోతో తన “అసోసియేషన్” అధికారికంగా ఆ రోజు ముగిసిందని పేర్కొనడం గమనార్హం.