

ఆర్ఆర్ఆర్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రామ్‌చరణ్. హాలీవుడ్లో అవార్డులు తీసుకుంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్న ఆయన తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తెలుగు భాషలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏయే సినిమాలో ఇష్టమో చెప్పుకొచ్చాడు. ‘ద నోట్‌బుక్, టెర్మినేటర్ 2.. ఇదైతే దాదాపు 50 సార్లు చూసుంటాను.
ఆ మూవీస్ అంటే అంతిష్టం నాకు. గ్లాడియేటర్ సహా టారంటినో చిత్రాలన్నీ ఇష్టమే! ఆ సిరీస్‌లో వచ్చిన ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ నా ఫేవరెట్. తెలుగులో దానవీరశూరకర్ణ, బాహుబలి.. అలాగే నా మూవీ రంగస్థలం అంటే ఎంతో ఇష్టం. శేఖర్ కపూర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ ఇండియా కూడా నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి’ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రామ్‌చరణ్ ఇటీవలే తన క్రష్ విషయాలను కూడా బయటపెట్టాడు. టీనేజ్‌లో ఉన్నప్పుడు జెటా జోన్స్, జులియా రాబర్ట్స్ అంటే క్రష్ ఉండేదని వెల్లడించాడు.
ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. గోల్డెన్ గ్లోబ్, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్, హెచ్‌సీఏ అవార్డులు అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్ వైపు ఆశగా చూస్తోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. మార్చి 12న జరగనున్న ఈ అవార్డుల ఫంక్షన్లో నాటు నాటు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుండటం విశేషం. మరి చరణ్, తారక్ కూడా లైవ్‌లో కాలు కదుపుతారా? అన్నది క్లారిటీ లేదు. దీని గురించి చెర్రీ మాట్లాడుతూ.. ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ కురిపించారు. ఆ పాటకు మేము స్టెప్పులేసి ఆ ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడిది గొప్ప నివాళిగా నిలిచిపోతుంది అని చెప్పుకొచ్చాడు.