Oscars 2023: ఆస్కార్‌ తీసుకున్న ఇండియన్‌ మహిళ కించపరిచిన అకాడమీ

Oscars 2023: బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది.

ఆస్కార్‌ అందుకున్న ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు  ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఆస్కార్‌ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే వెంటనే ఆ స్పీచ్‌ను కట్‌ చేస్తారు.

ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్‌ కార్తీకి తనకిచ్చిన గడువులోనే స్పీచ్‌ ముగించింది. అయితే నిర్మాత గునీత్‌ మోంగా మాట్లాడటం మొదలుపెట్టకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుతిరిగింది. పోనీ అందరి విషయంలోనూ అకాడమీ ఇలానే ప్రవర్తించిందా? అంటే లేదు. వీరి తర్వాత బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ అవార్డులు తీసుకున్న చార్లెస్‌ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్‌లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా ఎక్కువసేపు ప్రసంగించినా అభ్యంతరం తెలపలేదు. దీనిపై అమెరికన్‌ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు నెటిజన్లు సైతం అకాడమీ భారత్‌ను అవమానించిందంటూ ట్విటర్‌లో మండిపడుతున్నారు.

దీనిపై నిర్మాత గునీత్‌ స్పందిస్తూ.. ‘ఆస్కార్‌ వేదికపై నన్ను ప్రసంగించనివ్వలేదు. ఇది నన్ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే భారత్‌ నిర్మించిన ఓ షార్ట్‌ ఫిలింకు ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చాటిచెప్పాలనుకున్నా. కానీ నన్నసలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే ఛాన్స్‌ రాలేదని బాధేసింది. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది.

ఇండియాకు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని పంచుకుంటున్నాను. నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.