పది ప్రీఫైనల్ తీసికట్టు! ముందుగానే ప్రశ్నపత్రం ప్రత్యక్షం

పది ప్రీఫైనల్ తీసికట్టు!

♦️ముందుగానే ప్రశ్నపత్రం ప్రత్యక్షం

♦️వాటిని చూసి విస్తుపోతున్న టీచర్లు

♦️కీలకమైన పరీక్షల నిర్వహణలో ఉదాసీనత

అమరావతి

పబ్లిక్‌ పరీక్షలకు ముందుగా నిర్వహించే ప్రీఫైనల్‌ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. ఎంతో ప్రాధాన్యమున్న ఈ పరీక్షలను పాఠశాల విద్యా శాఖ తేలిగ్గా తీసుకుంది. ఈ నెల 9 నుంచి టెన్త్‌ విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరులో పరీక్షల నిర్వహణకు ముందుగానే పేపరు బయటకు వస్తోంది. చాలా మంది విద్యార్థులు ఆ ప్రశ్నలు మాత్రమే చదివి పరీక్ష రాస్తున్నారు. మరికొందరు ఆ ప్రశ్నలేవో ముందుగానే తెలియడంతో వాటి వరకు పుస్తకాల్లో నుంచి సమాధానాలు చించుకెళ్లి రాస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏడాదంతా కష్టపడి చదివిన చదువుకు ఈ పరీక్షలే ఓ గీటురాయి. అలాంటి పరీక్షలను మొక్కుబడిగా నిర్వహించడంపై పదో తరగతి బోధించే ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇప్పటికే జరిగిన తెలుగు, ఇంగ్లీష్‌ పేపర్లు ముందుగానే బయటకు రావడం విద్యాశాఖ పర్యవేక్షణ లోపాన్ని తెలియజేస్తోంది.

ముందు రోజే పేపరు ప్రత్యక్షం

మంగళవారం జరిగిన ఆంగ్లం పేపరు ఒక రోజు ముందుగానే అంటే సోమవారం రాత్రికే యూట్యూబ్‌లో ప్రత్యక్షమైందని, దాన్ని చూసి ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. తీరా మంగళవారం విద్యార్థులకు పరీక్ష హాల్లో అందజేసిన ప్రశ్నపత్రం, యూట్యూబ్‌లో పెట్టిన పత్రం రెండూ ఒకటేనని ఉపాధ్యాయుడొకరు గుర్తు చేశారు. ఇప్పటికే నిర్వహించిన ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల పత్రాలు ముందుగానే యూట్యూబ్‌లో వచ్చేవని, చివరకు ప్రీఫైనల్‌ పరీక్షల పత్రాలు ముందుగానే ప్రత్యక్షం కావడం తమను ఆందోళనకు గురిచేస్తోందని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నారు. ఈ పరీక్షలను నిత్యం విద్యార్థులు కష్టపడి చదవి రాయాల్సి ఉండగా చాలా మంది యూట్యూబ్‌లో వచ్చే ప్రశ్నపత్రాలపై ఆధారపడి అంతమేరకే చదివి కేంద్రాలకు వస్తున్నారు. అంతిమంగా ఇది విద్యార్థులకు నష్టం చేస్తుందని టీచర్లు అంటున్నారు. ఇది పేపర్‌ లీకా? మరొకటా అనేది పక్కన పెడితే ముందుగానే పేపర్‌ లభ్యం కావడంతో విద్యార్థులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ పరీక్షల నిర్వహణ వల్ల ఏం ప్రయోజనమనేది ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తించాలి. మిగిలిన వాటినైనా పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎమ్మార్సీల నుంచి గంట ముందే పంపిణీ

వాస్తవానికి ఈ ప్రశ్నపత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్టీ) రూపొందించి, వాటిని ముద్రించి బండిళ్లను క్షేత్రస్థాయిలోని స్కూళ్లకు చేర్చేలా చర్యలు తీసుకోవాలి. ఇలాచేస్తే ముందుగా పేపరు సామాజిక మాధ్యమాల్లో రావడానికి ఆస్కారం ఉండదు. కానీ ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నపత్రాలను మాత్రమే రూపొందించింది. వాటి ముద్రణను విస్మరించింది. వాటిని జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ)కు పంపి ముద్రించి స్కూళ్లకు అందజేయాలని ఆదేశించారు. వారికి పేపరు ముద్రించి స్కూళ్లవారీగా ప్రశ్నపత్రాల బండిళ్లు పంపడానికి సరిపడా సమయం లేకపోయింది. దీంతో వారు మండలాల వారీగా ఎమ్మార్సీ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడి నుంచి ఉపాధ్యాయులే వచ్చి ఆ బండిళ్లను స్కూళ్లకు పట్టుకెళ్తున్నారు. స్కూళ్లకు పట్టుకెళ్లడానికి పరీక్ష నిర్వహణ కన్నా గంటా, గంటన్నర ముందుగానే బాధ్యులైన ఉపాధ్యాయుల చేతికి ప్రశ్నపత్రాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పేపరు కొంత ముందుగా బయటకు రావటానికి ఆస్కారం ఉందని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆంగ్లం పేపరు సోమవారం రాత్రికే యూట్యూబ్‌లో ప్రత్యక్ష కావటం చూసి ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడి దృష్టికి తీసుకొచ్చారు. అయితే సదరు సంఘ నాయకుడు మంగళవారం పేపరు అధికారికంగా వచ్చే దాకా దీన్ని నమ్మలేమని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. తీరా మంగళవారం ఇచ్చిన పేపరు, సోమవారం రాత్రి యూట్యూబ్‌లో పెట్టిన పత్రం రెండూ ఒక్కటేనని తేలిందని సదరు సంఘ నాయకుడు పేర్కొన్నారు.
బీ ప్రశ్నపత్రాలు పరీక్ష నిర్వహణకు ముందుగానే బయటకు వస్తున్న విషయమై గుంటూరు ప్రాంతీయ విద్యా సంచాలకులు సుబ్బారావును వివరణ కోసం ‘ఈనాడు’ పలుమార్లు ఫోన్‌లో సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.