AP CM: సీఎం జగన్ సమక్షంలో ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ..

సమ్మిట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోంది. ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రగతికి ఏపీ సర్కార్‌ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో స్టేట్‌ ఏపీ. సీఎం జగన్‌ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.  ఈ సందర్బంగానే ఏపీలో పెట్టుబడులను ప్రకటించారు. ఏపీలో 10 గిగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ మాట్లాడుతూ..

ఏపీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ కనెక్టివిటీ బాగుంది.

ఒబెరాయ్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ బబెరాల్‌ మాట్లాడుతూ..

ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఏపీ పర్యాటక విధానం ఉత్తమంగా ఉంది. పర్యాటక రంగంలో ప్రీమియర్‌ డెస్టినేషన్‌గా ఏపీ ఉందని కితాబిచ్చారు.

రెన్యూ పవర్‌ ఎండీ సుమంత్‌ సిన్హా మాట్లాడుతూ..

పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చాలా అవసరం. పరిశ్రమల అభివృద్ధికి ఏపీలో మంచి పాలసీలు ఉ‍న్నాయి. పరిశ్రమల పట్ల ఏపీలో పాజిటివ్‌ అప్రోచ్‌ ఉంది. ఇంధన రంగంలో​ ఏపీకి 3 అవార్డులు రావడం ప్రశంసనీయం. పవన, సౌర విద్యుత్ రంగంలో ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం జగన్‌ దార్శనికతతో తొందరగా అనుమతులు ఇస్తున్నారు. ఏపీలో ఉన్నతాధికారులు వేగంగా స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం అని హామీ ఇచ్చారు.