జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరండి

కులాలను కలిపే ఆలోచనా విధానంతో, మత ప్రస్తావనలేని రాజకీయ విధానంతో, భాషలను గౌరవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ,
ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతి రహిత సమాజ స్థాపనే ద్యేయంగా, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ ఆరోగ్యవంతమైన సమ సమాజాన్ని భావి భారత పౌరులకు అందించే మహోన్నత లక్ష్యంతో ఏర్పడిన జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మచుకునే ప్రయత్నంలో భాగస్వాములు కావలసిందిగా జనసేనపార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బొటుకు రమేష్ బాబు ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.

ప్రకాశం జిల్లా ప్రజలకు బొటుకు రమేష్ బాబు పిలుపు

క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతీ ఒక్క జనసేనపార్టీ వాలంటీర్ కి ఆయన అభినందనలు తెల్పుతూ, ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పించారని, జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ మహోన్నతమైన జనసేనపార్టీ సప్త సిద్ధాంతాలను, అధినేత ఆకాంక్షలను తెలియపరచి ప్రజలందరికీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వమును తీసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు.

మన రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి

స్వాతంత్య్రం సిద్దించిన తరువాత ప్రభుత్వాలు ఎన్నో మారాయని, కానీ ఇంకా ప్రజలందరికీ సమాన అవకాశాలకోసం, హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయని, విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో అభివృద్ధి కరువైందని, చిత్తశుద్ధి కరవైన ప్రభుత్వాల పాలనలో – అనాదిగా కులాలు-మతాలు-భాషలు-సాంప్రదాయాలు పేరుతో అంతరాలు పెరుగుతూనే ఉన్నాయని, రక్షణ కోసం, సాధికారతకోసం, అభివృద్ధి కోసం ఇంకా మహిళలతో బాటు అన్నివర్గాల ప్రజలు ఎదురుచూస్తూనే వున్నారని, అవినీతితో ప్రభుత్వ పథకాలు ప్రక్కదోవ పడుతున్నాయని, స్వార్థ ప్రయోజనాలతో ముందుచూపులేని మైనింగ్ లాంటి విధానాలతో వాతావరణ కాలుష్యం పెరుగుతూనే ఉందని, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో – పేరుకే ప్రకాశం కానీ, ప్రజల జీవితాలలో ప్రకాశం లేదని, దశాబ్దాలకాలంగా వెలిగొండ ప్రాజెక్ట్ ఫలాలు వారికి అందలేదని, సాగునీరు-సురక్షిత త్రాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే వున్నారని, వలస వెళ్లే దుస్థితినుండి ఇంతవరకు వారికి విముక్తి లభించలేదని, దర్శి నియోజకవర్గంలో మొగిలిగుండాల రిజర్వాయరుకి మోక్షం లభించలేదని, చిలకలేరు వాగును పట్టించుకునేవారే లేరని, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి ప్రకటన శుష్కవాగ్దానాలకే పరిమితమైందని, ఉన్నత విద్య అవకాశాలకోసం, మెరుగైన వైద్యం కోసం ఆమడ దూరాలు వెళ్లాల్సిన దుస్థితి ఉందని, వనరులు ఉండీ, దర్శి నియోజకవర్గం లాంటి ఎన్నో నియోజకవర్గాలు జిల్లాలో అభివృద్ధి చెందలేదని – కనుక మన ప్రాంతాలను, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరముందని, ఒక మహోన్నత లక్ష్యంతో ముందుకు వచ్చిన జనసేన పార్టీ ద్వారా ఇది సాధ్యమవుతుందని, కనుక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన జనసేనపార్టీ వాలంటీర్స్ ఒక గొప్ప సమాజాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు రమేష్ బాబు వారిని అభినందించారు. క్రియాశీలక సభ్యులకు జనసేనపార్టీ వ్యక్తిగత ప్రమాద భీమా అవకాశాన్ని కల్పించిందని, పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి శ్రేయస్సు కోసం అధినేత ఎల్లప్పుడూ ఆలోచిస్తారని అన్నారు. ఈనెల ఇరవై ఎనిమిదిలోపు జిల్లా వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, ప్రతీ వాలంటీర్ పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతను రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశంగా, అదృష్టంగా భావించి, భారీ స్థాయిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయాలని కోరారు.